ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన రాంనాథ్ కోవింద్ ఈరోజు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ మొదట సెట్ నామినేషన్ పత్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సంతకం చేస్తారు. రెండవ సెట్ పై ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, మూడవ సెట్ పై భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా సంతకాలు చేస్తారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ఇంకా అనేక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఎన్డీయే కూటమిలోనివారే కాకుండా తెరాస, డిఎంకె, అన్నాడిఎంకెలో రెండు చీలికవర్గాలు, జెడియు, బిజు జనతాదళ్ వంటి అనేక ఇతర పార్టీలు కూడా మద్దతు ఇస్తునందున ఆయనకు 63.1 శాతం ఓట్లు కూడాయి. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు చేస్తున్న ప్రయత్నాల వలన జూలై 17న జరిగే ఎన్నికల నాటికి రాంనాథ్ కోవింద్ కు మద్దతు ఇచ్చేవారి సంఖ్య మరింత పెరుగవచ్చు. కనుక ఆయనే మన కొత్త రాష్ట్రపతి అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికలలో గెలిచేందుకు తగినన్ని ఓట్లు లేవని తెలిసి కూడా మీరా కుమార్ బరిలో దిగారు కనుక ఆమెకు భంగపాటు తప్పదు. అందుకు ఆమె సిద్ధపడే ఉంటారు.