బోరుబావిలో పడిన చిన్నారి

నీటి కోసం త్రవ్విన బోరుబావులలో నీళ్ళు పడకపోవడంతో తీవ్ర నిరాశనిస్పృహలకు గురయ్యే రైతన్నలు వాటిని అలాగే విడిచిపెడుతుంటారు. అవే చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయనే సంగతి తెలిసినా సదరు రైతులు, గ్రామాధికారులు, ప్రభుత్వం, వ్యవసాయాధికారులు ఎవరూ చొరవ తీసుకొని వాటిని మూయించే ప్రయత్నాలు చేయకపోవడం చాలా బాధాకరం. వారి నిర్లక్ష్యానికి చిన్నారులు బలవుతూనే ఉన్నారు. 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలో చన్ వెళ్ళి గ్రామంలో ఏడాదిన్నర వయసు గల ఒక చిన్నారి పాప గురువారం సాయంత్రం బోరు బావిలో పడిపోయింది. ఆమె తన అక్క హర్షితతో అక్కడ ఆడుకొంటుండగా పొరపాటున బోరుబావిలో పడిపోయింది. వ్యవసాయకూలీలైన వారి తల్లి తండ్రులు యాదయ్య, రేణుక వికారాబాద్ జిల్లా నుంచి ఆ ప్రాంతానికి వచ్చి పొలం పనులు చేసుకొంటూ బ్రతుకుతున్నారు. వారు తమ పిల్లలను పొలం సమీపంలో కూర్చోబెట్టి పనులు చేసుకొంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంగతి తెలిసిన వెంటనే పోలీసులు, రెవెన్యూ  అధికారులు అక్కడికి చేరుకొని పాపను రక్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సంగతి తెలుసుకొన్న మంత్రి మహేందర్ రెడ్డి కూడా అక్కడకు చేరుకొని సహాయచర్యలు పర్యవేక్షిస్తున్నారు. 

దేశంలో ఎక్కడో అక్కడ నిత్యం ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు, పోలీసులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టడం, ఆ ప్రక్రియను మీడియా విస్తృతంగా కవర్ చేయడం, అదృష్టం బాగుంటే బోరుబావిలో పడిన పసిపిల్లలను ప్రాణాలతో వెలికి తీయడం లేకుంటే వారి శవాలను తల్లి తండ్రులకు అప్పగించడం, అది చూసి అందరూ జాలిపడటం, అధికారుల నిర్లక్ష్యంపై చర్చతో ఇక ఆ సంఘటన గురించి అందరూ మరిచిపోతుంటారు. మళ్ళీ అటువంటి సంఘటన జరిగినప్పుడు మళ్ళీ ఇదే తంతు కొనసాగుతుంటుంది. అంతే తప్ప ఒక ప్రమాదాన్ని గుణపాఠంగా భావించి మళ్ళీ అటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరూ భావించకపోవడం శోచనీయం.