టీవి ఆర్టిస్ట్ కిడ్నాప్, అత్యాచారం

హైదరాబాద్, ఎల్బీ నగర్ లో ఉంటున్నఒక టీవీ ఆర్టిస్ పై అత్యాచారం జరిగింది. ఆమెను అనంతపురంకు చెందిన గిరీష్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి అనంతపురానికి తరలించి అక్కడ బలవంతంగా ఆమె నగ్నఫోటోలను తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె అతికష్టం మీద అతని చెర నుంచి తప్పించుకొని మళ్ళీ హైదరాబాద్ చేరుకొని రాచకొండ పోలీస్ కమీషనర్ కు పిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గిరీష్ ను అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.        

డిల్లీలో నిర్భయ కేసు తరువాత కేంద్రప్రభుత్వం కటినమైన నిర్భయ చట్టం రూపొందించి అమలు చేస్తున్నా దేశంలో కామందులు దానికి ఏమాత్రం భయపడటం లేదు. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. రెండు మూడు రోజుల క్రితమే బిహార్ లో రైలులో ఒక బాలికపై కొందరు కామందులు అత్యాచారం చేసి ఆమెను కదులుతున్న రైలులో నుంచి బయటకు త్రోసేశారు. ఆ మర్నాడు దేశరాజధాని డిల్లీలో ఒక కారులో మహిళపై అత్యాచారం జరిగింది. డిల్లీ వీధులలో కారును తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేసారు.

వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వాలు వాటిని సీరియస్ గా తీసుకొని ఉక్కుపాదంతో అణచివేయడానికి గట్టి ప్రయత్నాలు చేయవడం లేదు. సినిమాలు, రాజకీయ విమర్శలు, కుంభకోణాల గురించి ప్రముఖంగా వార్తలు ప్రసారం చేసే మీడియా అత్యాచారం పాల్పడినవారికి కటినమైన శిక్షలు విధిస్తున్నట్లు హైలట్ చేయడం లేదు. ప్రభుత్వం, మీడియా, పోలీసులు, చట్టాలు, సమాజం అందరూ గట్టిగా ప్రతిఘటించకకపోవడం వలననే నానాటికీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చెప్పక తప్పదు.