తెలంగాణాలో జనసేన!

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు పూర్తి భిన్నంగా పార్టీని నిర్మించుకొంటుండటం విశేషం. ఇతర పార్టీల నుంచి నేతలను, కార్యకర్తలను ఆహ్వానించే ప్రయత్నం చేయకుండా ఒక కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా జనసేనలో చేరదలచుకొన్నవారి నుంచి జిల్లాలవారిగా ఆన్-లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తూ వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి వాటిలో ఉత్తీర్ణులైనవారినే పార్టీలో చేర్చుకొంటోంది. ఈ విధానం చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలలో నుంచి జనసేన కార్యకర్తల ఎంపికకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

గ్రేటర్ హైదరాబాద్ తో బాటు ఏపిలో ఇప్పటికే అనేక జిల్లాలలో జనసేన కార్యకర్తల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా అదే పద్దతిలో జనసేన కార్యకర్తల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. ముందుగా ఈనెల 24న అదిలాబాద్, 25న కరీంనగర్ జిల్లాలలో అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఆ రెండు జిల్లాల నుంచి జనసేనలో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు ఆన్-లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆహ్వానించింది.    

ఈనెల 24న మంచిర్యాల్ జిల్లాలోని ఫారెస్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ లో, 25న పెద్దపల్లి జిల్లాలో డీసెంట్ ఫంక్షన్ హాల్ లో జనసేన కార్యకర్తల ఎంపిక కార్యక్రమం ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఆన్-లైన్ లో దరఖాస్తు చేసుకోలేనివరున్నట్లయితే ఆరోజున నేరుగా వేదిక వద్దే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 

జనసేన పార్టీని కష్టపడి నిర్మించుకోవచ్చు కానీ తెరాస, కాంగ్రెస్ పార్టీలను కాదని తెలంగాణా ప్రజలు జనసేనను ఆదరిస్తారా? అనే అనుమానం ఉంది.