కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి.ఎస్.కర్ణన్ జైలుకు వెళ్ళవలసిందేనని సుప్రీంకోర్టు మరోసారి నిన్న తేల్చి చెప్పింది. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు సుప్రీంకోర్టు ఆయనకు 6 నెలలు జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి అంటే మే 9 నుంచి అయన పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. పశ్చిమబెంగాల్ పోలీసులు నిన్న ఆయనను తమిళనాడులో కోయంబత్తూరులో అరెస్ట్ చేశారు. వెంటనే ఆయన తరపు న్యాయవాది మాథ్యూ సుప్రీంకోర్టులో బెయిల్ కోసం మరోసారి పిటిషన్ వేశారు. కానీ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మార్చడానికి బలమైన కారణం ఏదీ తమకు కనబడనందున జస్టిస్ కర్ణన్ జైలుకు వెళ్ళక తప్పదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు నేడు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత అక్కడి నుంచి నేరుగా జైలుకు తరలిస్తారు. ఒక హైకోర్టు న్యాయమూర్తి కోర్టు దిక్కారనేరానికిగాను జైలు శిక్ష అనుభవించడం దేశంలో ఇదే మొదటిసారి.