కోల్ కతా మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు మంగళవారం తమిళనాడులోని కోంబత్తూర్ లో అరెస్ట్ చేశారు. ఆయనపై సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో గత నెలన్నర రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అరెస్ట్ భయంతో ఆయన పదవీ విరమణ కూడా చేయలేదు. కానీ ఎట్టకేలకు ఆయన పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యారు. రేపు ఆయనను కోల్ కతా తరలించి న్యాయస్థానంలో ప్రవేశపెడతారు.
ఒక హైకోర్టు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం, ఇంతకాలం చట్టాన్ని అమలుచేస్తూ తీర్పులు చెప్పిన ఆయన సుప్రీంకోర్టు ముందు హాజరవకుండా పోలీసులను తప్పించుకొని తిరుగడం, చివరకు పోలీసులకు చిక్కి సాటి న్యాయమూర్తి ముందు దోషిగా బోనులో నిలబడవలసి రావడం, ఆ తరువాత జైలుకు వెళ్ళవలసి రావడం అన్నీ విచిత్రమైన పరిణామాలే. అవి స్వయంకృతాపరాధమే కనుక ఆయన తనను తాను నిందించుకోవలసి ఉంటుంది.
దేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం అని దాని తీర్పుకు తిరుగులేదని న్యాయమూర్తిగా పనిచేసిన ఆయనకు తెలిసినప్పటికీ ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే జరిమానాలు, జైలు శిక్షలు విధించి దాని ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత తనను క్షమించి విడిచిపెట్టమని అదే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకొన్నారు. కానీ సుప్రీంకోర్టు అంగీకరించకపోవడంతో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకొని ఆవిధంగా మరో సరికొత్త రికార్డు సృష్టించారు. కానీ రాష్ట్రపతి కూడా ఆ పిటిషన్ పై స్పందించకపోవడంతో ఏమి చేయాలో పాలుపోక ఇంతకాలం అజ్ఞాతంలోనే ఉండిపోయారు.
ఏది ఏమైనప్పటికీ ఒక హైకోర్టు న్యాయమూర్తిని జైలుకు పంపడం మన న్యాయవ్యవస్థకు ఏమాత్రం గౌరవం కాబోదు కనుక సుప్రీంకోర్టు ఆయనను క్షమించి విడిచిపెట్టేస్తే బాగుంటుంది. అవసరమనుకొంటే లిఖిత పూర్వకంగా క్షమాపణ పత్రం తీసుకొంటే సరిపోతుంది.