అప్పుడే ఏ పధకమైనా విజయవంతం అవుతుంది

తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పధకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తూ “పధకాలు ప్రకటిస్తే సరిపోదు. అవి కాగితాలకే పరిమితం అయితే విజయవంతం అవవు. వాటి కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పుడే విజయవంతం అవుతాయి. మీకు ఈ గొర్రెలు పంచిపెట్టేసి దానితో మా పని అయిపోయిందని చేతులు దులుపుకోవడం లేదు. గొర్రెలకు రోజూ చాలా ఆహారం అవసరం. అది కూడా మంచి ఆహారం అందిస్తేనే అవి బలంగా, బరువుగా ఎదుగుతాయి. కనుక ప్రతీ జిల్లాకు నాలుగు టన్నుల గడ్డి విత్తనాలు సరఫరా చేస్తున్నాము.

అలాగే గొర్రెలకు ఆహరం అందించేందుకు బీడు భూములలో తుమ్మ మొదలైన చెట్లను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోమని కలెక్టర్లను కోరుతున్నాను. పండ్లతోటలు పండించే రైతులు తమ చెట్ల మద్య ఈ గొర్రెల కోసం గడ్డి పెంచినట్లయితే వాటికి తగినంత ఆహారం దొరుకుతుంది. దానిని అమ్ముకొన్నందున ఆ రైతులకు లాభం వస్తుంది. పైగా వాటి వ్యర్ధాల వలన పంటలకు మంచి సేంద్రీయ ఎరువు లభిస్తుంది కనుక పంటలు ఇంకా బాగా పండుతాయి. కనుక గొర్రెలకాపర్లకు, పండ్లతోటల యజమానులకు మధ్య ఈ ఏర్పాటు కుదిరేలా చేయమని నేను కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ఒకేసారి గొర్రెల సంఖ్య పెరిగింది కనుక వాటికి త్రాగేందుకు ఎక్కడికక్కడ నీళ్ళ కుంటలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. 

ఇక గొర్రెలకు ఏదో ఒక జబ్బులు రావచ్చు. కనుక వాటిని వెంటబెట్టుకొని మీరు ఎక్కడో పశువుల దవాఖానల దగ్గరకు పోనవసరం లేదు. ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 అంబులెన్సులు కొనుగోలు చేస్తున్నాము. వాటిలో ఒక పశువుల డాక్టరు, సిబ్బంది, మందులు అన్నీ ఉంటాయి. అవసరమైనప్పుడు మీరు 1962 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు ఆ అంబులెన్సులే మీ మందల దగ్గరకు వస్తాయి. మీరున్న చోటే మీ గొర్రెలకు వైద్యం అందుతుంది. ప్రతీ ఏడాది మూడుసార్లు అన్ని గొర్రెలకు టీకాలు వేస్తారు. ప్రతీ గొర్రెకు ప్రభుత్వమే భీమా చేయిస్తుంది. మేము అన్ని ఏర్పాట్లు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాము. ఇక ఈ పధకాన్ని విజయవంతం చేయవలసిన భాద్యత మీదే,” అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా కొండపాక గ్రామాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 కోట్లు మంజూరు చేశారు.