ఏపి మంత్రికి కూడా మియాపూర్ లో భూమి?

రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారో అసాంఘిక శక్తులో భూఆక్రమణలకు పాల్పడితే వింతేమి లేదు కానీ అధికారంలో ఉన్న మంత్రులు, పార్టీ నేతలు కూడా ప్రభుత్వ భూములపై కన్నేస్తే ఎవరూ జీర్ణించుకోలేరు. మియాపూర్ భూకుంభకోణం గురించి రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మద్య ఎంత గొడవ జరుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. అక్కడ ఏపి మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా భూములు కొన్నారని భాజపా నేత రఘునందన్ రావు ఆరోపించారు. మియాపూర్ లో సర్వే నెంబర్: 77లో వివాదాస్పద భూములలో 24.5 ఎకరాలు గంటా శ్రీనివాస రావు కొని దానిని ఎవరూ ఆక్రమించుకోకుండా దాని చుట్టూ కంచె కూడా వేయించారని ఆరోపించారు. ఆయనకు తెలంగాణాకు చెందిన ఒక మంత్రి సహకరించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై మంత్రి గంటా కానీ తెలంగాణా ప్రభుత్వంలో ఎవరూ స్పందించకపోవడం విశేషం. మియాపూర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వాటిలో మంత్రి గంటాకు చెందిన భూములు కూడా ఉన్నాయా లేవా? అనే విషయం తెలియవలసి ఉంది. అక్కడ ఆయన భూములను కొన్నట్లు రఘునందన్ రావు ఆరోపణలు చేశారు కనుక దీనిపై కూడా ఆయనే స్పష్టత ఇస్తే బాగుంటుంది.