ఐసిసి చాంపియన్ ట్రోఫీలో పాక్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయినందుకు భారత్ లో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆవేదన, ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే కాశ్మీర్ లో యువత మాత్రం పాక్ గెలిచినందుకు మిటాయిలు పంచుకొని, బాణాసంచా కాల్చి పండుగ చేసుకొన్నారు. శ్రీనగర్ లో అనేక ప్రాంతాలలో యువత రోడ్లపైకి వచ్చి ఆనందంగా చిందులు వేశారు. మరికొందరుఅత్యుత్సాహవంతులు స్థానిక పోలీస్ స్టేషన్లు, ఆర్మీ క్యాంపుల ముందు పటాసులు కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీనిని బట్టి వారు పాక్ తో ఎంతగా మమేకం అయ్యున్నారో అర్ధం అవుతోంది. తమను తాము భారతీయులుగా కాక పాక్ పౌరులుగా భావిస్తున్నట్లు అర్ధం అవుతోంది.
వారు వేర్పాటువాదులతో కలిసి పనిచేస్తున్నా, పాక్, ఐసిస్ జెండాలు పట్టుకొని భారత్ వ్యతిరేక నినాదాలు సభలు నిర్వహిస్తున్నా, భద్రతాదళాలపై రాళ్ళతో దాడులు చేస్తున్నా వారిని ఏమిచేయలేని నిస్సహాయ స్థితి నెలకొని ఉంది. అటువంటివారి కోసం యావత్ భారతీయులు కడుతున్న పన్నులతో వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ఖర్చు చేయవలసి వస్తోంది. దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి పాక్ ఆక్రమిత ప్రాంతాలలో నెలకొని ఉంది. అక్కడ ఉగ్రవాదులు, పాక్ ఆర్మీ చేస్తున్న అకృత్యాలను భరించలేకపోతున్న ప్రజలు భారత్ వైపు ఆశగా చూస్తున్నారు. వారి దయనీయ పరిస్థితిని చూస్తున్నప్పటికీ కాశ్మీర్ లో యువత పాకిస్తాన్ లో కలిసిపోవాలని ఉవ్విళ్ళూరుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.