
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ దేశంలో నదుల అనుసంధానం కోసం కోటి రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి ప్రయత్నాలు చేయలేదు కనుక రజనీకాంత్ ఆ డబ్బు ఇవ్వలేదు. ఇటీవల డిల్లీలో సుమారు రెండు నెలలు దీక్షలు చేసిన తమిళరైతులలో కొందరు ఇదే విషయం అడిగేందుకు నిన్న తమ నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలో చెన్నైలోని రజనీకాంత్ ఇంటికి వెళ్ళారు. వారిని ఆయన సాదరంగా ఆహ్వానించి ఈవిషయంపై చర్చించారు. కోటి రూపాయలు ఎప్పుడు ఎవరికీ ఇవ్వమంటే వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని రజనీ చెప్పగా దానిని ప్రధానమంత్రి సహాయనిధికి అందించాలని వారు కోరారు. పంట రుణాల మాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు, దక్షిణాది రాష్ట్రాల నదుల అనుసంధానం మొదలైన సమస్యలపై మళ్ళీ పోరాటానికి సిద్దం అవుతున్న తమకు రజనీ మద్దతు తెలిపారని అయ్యాకన్ను మీడియాకు తెలిపారు.
రజనీకాంత్ ఈ ఏడాది చివరిలోగా రాజకీయపార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ రజనీకాంత్ ఆ వార్తలను ఖండించడం లేదు. అలాగని రాజకీయ పార్టీ స్థాపించబోతున్నానని ప్రకటించే సాహసం చేయలేకపోతున్నారు. సినిమాలలో గొప్ప హీరోయిజం ప్రదర్శించే ఆయన నిజజీవితంలో కూడా అలా ఉండాలని ఎవరూ ఆశించలేరు. కానీ తన రాజకీయ ప్రవేశం గురించి ఇన్ని వార్తలు, ఊహాగానాలు వస్తున్నా వాటిపై ఆయన స్పందించకపోవడం అభిమానులను కూడా నిరాశపరుస్తుంది. ఇక మన దేశంలో నదుల అనుసంధానం ఆలోచనలు దశాబ్దాలుగా మాటలకు, కాగితాలకే పరిమితమైన సంగతి తెలుసు. కనుక ఆచరణలోకి రాలేని అటువంటి వాటికి విరాళం ఇవ్వడం కంటే అష్టకష్టాలు పడుతున్న తమిళరైతులకే దానిని వినియోగిస్తే వారికి, ఆయనకు కూడా లబ్ది కలుగుతుంది కదా!