మళ్ళీ ఉదృతమైన గూర్ఖా ఉద్యమం

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ పర్వత ప్రాంతం ప్రధానంగా పర్యాటక కేంద్రం కనుక దేశవిదేశాల నుంచి అక్కడికి వచ్చే పర్యాటకులతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. కానీ మళ్ళీ అక్కడ గూర్ఖాల ఉద్యమం ఉదృతమవడంతో యుద్దవాతవరణం నెలకొని ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమపై బలవంతంగా బెంగాలీ బాషను రుద్దుతోందని అనే కారణంతో మొదలైన ఉద్యమం ఈరోజు హింసాత్మకంగా మారింది.

ఉద్యమకారులకు పోలీసులకు మద్య జరిగిన ఈరోజు జరిగిన ఘర్షణలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులు అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో గూర్ఖా జనముక్తి మోర్చాకు చెందిన ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. దానితో ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసులపై ఎదురుదాడి చేశారు. ఆ దాడిలో 2వ రిజర్వ్ బెటాలియన్ కు చెందిన కమాండర్ కిరణ్ తామంగ్ ను ఆందోళనకారులు కత్తితో పొడవడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది.

ఇక పోలీసుల వలన పరిస్థితి అదుపులోకి తీసుకురాలేమని భావించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆర్మీని రంగంలో దింపారు. నిన్న మొన్నటి వరకు పర్యాటకులతో కళకళలాడిన డార్జిలింగ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా భద్రతాదళాలే తుపాకులు పట్టుకొని పహారా కాస్తూ కనిపిస్తున్నాయి. 

“గూర్ఖాలు చేస్తున్నది ఉద్యమం కాదని ఇదొక బారీ కుట్ర అని, వారి వెనుక ఎవరున్నారో..ఎవరు వారికి ఆయుధాలు అందిస్తున్నారో అన్ని నాకు తెలుసు” అని మమతా బెనర్జీ అన్నారు. ఇప్పటికీ పరిస్థితి మించిపోలేదని గూర్ఖా నేతలు ముందుకు వస్తే వారితో సంప్రదింపులకు తాను సిద్దంగా ఉన్నానని అన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నేటికీ రావణకాష్టంలాగ రగులుతూనే ఉంది. మొన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో అల్లర్లు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలు సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఈవిధంగా రాజకీయాలు చేస్తుండటం వలననే గోటితో పోయే సమస్యలు గొడ్డలిని ఉపయోగించవలసి వస్తోంది. మన రాజకీయ పార్టీలు ఇంకా ఎప్పటికి మారుతాయో..అసలు మారుతాయో లేదో!