ముంబై బాంబు ప్రేలుళ్ళ కేసుపై తీర్పు

ముంబై ప్రేలుళ్ళ కేసులో టాడా కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. 1993 మార్చి 12న ముంబైలో ఒకేసారి వేర్వేరు ప్రాంతాలలో జరిగిన ప్రేలుళ్ళలో మొత్తం 257మంది చనిపోగా 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసుపై 24 సం.ల సుదీర్గ విచారణ తరువాత నేడు టాడా కోర్టు తీర్పు చెప్పింది. ఆ ప్రేలుళ్ళలో నిందితులుగా పేర్కొనబడిన 8 మందిలో దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబుసలేంతో సహా ఏడుగురు దోషులేనని ప్రకటించింది. వారి పేర్లు: అబుసలేం, క‌రీముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ ర‌షీద్ ఖాన్, ముస్తాఫా డోసా, రియాజ్ సిద్ధిక్, త‌హీర్ మెర్చంట్, అబ్దుల్ ఖ‌య్యూమ్ లు దోషులుగా ప్రకటించింది.

వీరందరూ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కుట్రకు పధక రచన, దానిని అమలు చేయడానికి తగిన శిక్షణ, డబ్బు, ఆయుధాలు సమకూర్చుకోవడం, అంతిమంగా ప్రేలుళ్ళకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు లభించినందున వారందరినీ దోషులుగా ప్రకటించింది. వీరిలో ప్రధాన సూత్రధారి అబూ సలెంపై పై ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్స్ 326, 324, 436, 201,212, 302, 307 క్రింద శిక్షార్హుడని కోర్టు నిర్ద్వందంగా ప్రకటించింది. ఈ పేలుళ్లకు ప్రధాన సూత్రదారి దావూద్‌ ఇబ్రహీం పాక్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. కానీ అతను తమ దేశంలో లేదని పాక్ వాదిస్తున్న కారణంగా అతనిని భారత్ రప్పించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. 

ఈరోజు దోషులుగా ప్రకటింపబడిన వారందరికీ త్వరలో శిక్షలు ఖరారు చేయబడతాయి. ఒకవేళ టాడా కోర్టు వారందరికీ మరణశిక్షలు వేసినట్లయితే, మళ్ళీ వారు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ తరువాత రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం వగైరా తంతు సాగుతుంది కనుక ఈ కేసు మరో రెండు మూడేళ్ళు సాగినా ఆశ్చర్యం లేదు.