ఇటీవల బయటపడిన భూకుంభకోణాలపై రాష్ట్రంలో విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన తెరాస నేతలతో కలిసి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు బయటపడుతున్న ఈ అక్రమాలన్నీ ఆనాటి కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల నిర్లక్ష్యాలకు నిదర్శనాలు. వాటిని గుర్తించి కేసీఆర్ సరిదిద్దుతుంటే ప్రతిపక్షాలు ఆయనపైనే ఆరోపణలు చేస్తుండటం విచారకరం. అయితే అవి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలనే వల్లెవేస్తున్నాయి తప్ప కొత్తగా ఒక్క విషయం చెప్పలేకపోతున్నాయి. మియాపూర్ భూముల విషయంలో ఏదో బారీ కుంభకోణం జరిగిపోయిందన్నట్లు కాంగ్రెస్ నేతలు హడావుడి చేస్తున్నారు. కానీ ఆ భూముల రిజిస్ట్రేషన్ లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించగానే ప్రభుత్వం వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసి బాధ్యులు అందరిపై కటిన చర్యలు తీసుకొంది. ఆ భూములలో ఒక్క గజంభూమి కూడా పోలేదు. మరి బారీ కుంభకోణం జరిగిందని ఉత్తం కుమార్ రెడ్డి ఏవిధంగా అంటున్నారు? అసలు ఆయన వద్ద దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే బయటపెట్టాలి,” అని అన్నారు.
ఈ అక్రమాలలో లొసుగులను వివరిస్తూ “ఇటువంటి అక్రమాలను గుర్తించి నివారించడానికే ప్రతీ ఏటా భూముల ఆడిట్ జరుగుతుంటుంది. ఆ నివేదికలను బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకొంటున్నారు. 1950లో జాగీర్దార్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. కానీ వాటిపై నేటికీ కోర్టులలో కొన్ని కేసులు నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కేసీఆర్ పూనుకొన్నారు. జాగీర్దార్ భూచట్టానికి సవరణ చేయడం ద్వారా ఇకపై ఆ భూములు రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. నిజానికి ఈ పని గత ప్రభుత్వాలే చేసి ఉండవచ్చు కానీ ఆనాడు అవి పట్టించుకోకపోవడం వలన ఇప్పుడు ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ శాస్వితంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు ఆయనపైనే బురద జల్లాలని ప్రయత్నిస్తున్నాయి,” అన్నారు మంత్రి హరీష్ రావు.
‘కేసీఆర్ పాలన అవినీతి కంపుకొడుతోందని’ టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. “మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేంద్రప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకొంటున్నాయి. కానీ అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ గాలి సోకిన ప్రొఫెసర్ కోదండరామ్ కు మాత్రం మా కార్యక్రమాలు కంపుకొడుతున్నాయి. ఆయనకు కాంగ్రెస్ గాలి, దృష్టి సోకినట్లుంది,” అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.