ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిన్న ప్రగతి భవన్ లో జరిగిన మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఇటీవల వరుసగా బయటపడుతున్న కుంభకోణాలను వాటి నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిజాం కాలంనాటి జాగీరు భూములను ఇకపై రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతించకూడదని నిర్ణయించారు. నిజానికి అటువంటి భూములు ఎప్పుడో రద్దు అయ్యాయి. కానీ ఆనాటి డాక్యుమెంట్లకు నకిలీలను సృష్టించి ఏదోవిధంగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పైగా వాటి వలన ప్రభుత్వం అనేక న్యాయవివాదాలను కూడా ఎదుర్కోవలసి వస్తోంది. కనుక ఇకపై ఆ భూములను రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతించకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
ప్రభుత్వం ఎన్ని కటిన చర్యలు తీసుకొంటున్నప్పటికీ నకిలీ విత్తనాల బెడద తప్పడం లేదు. నకిలీ విత్తనాలు తయారుచేసే సంస్థలపై, వాటిని అమ్మే వ్యాపారులను జైలుకు పంపేవిధంగా ఆర్డినెన్స్ జారీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
అలాగే ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పాలు, పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్ధాలలో కల్తీలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి నకిలీ పాలు తయారుచేస్తున్నవారు పట్టుబడ్డారు. ఇక ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ కోడిగుడ్లు, ప్లాస్టిక్ క్యాబేజీలు మార్కెట్లలోకి వస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో అటువంటి నకిలీలు, కల్తీలు సృష్టించేవారిని కటినంగా శిక్షించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ నగరంలో, రాష్ట్రంలో గుట్కా, జూదం అరికట్టడానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని నిర్ణయించారు. రేపు అంటే శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. దానిలో ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ ల జారీపై మరోమారు చర్చించి నిర్ణయం తీసుకొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.