తెలంగాణా ప్రభుత్వం నిరంతరంగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవరోధాలను తొలగించుకోగలిగింది. గురువారం డిల్లీలో సమావేశమైన కేంద్రపర్యావరణ మరియు అటవీశాఖ సలహా మండలి ఈ ప్రాజెక్టుకు అవసరమైన 7,828 ఎకరాల (3,168.131 హెక్టార్లు) అటవీభూమిని అప్పగించేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చినట్లే అవుతుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమి, పర్యావరణ అనుమతులు లభించినందున ఇక ప్రాజెక్టు నిర్మాణపనులు వేఅవంతం చేయవచ్చు.
ఈ ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని తరలించడానికి ఈ అటవీ భూమి గుండా కాలువలు నిర్మించవలసి ఉంది. అలాగే సర్జ్ పూల్, రిజర్వాయర్ కూడా నిర్మిస్తారు. మల్లన్నసాగర్ నిర్మాణానికి కూడా ఈ అటవీ భూమి చాలా అవసరం. కరీంనగర్, మహాదేవ్ పూర్,సిద్ధిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్స్ వాడ, నిర్మల్ డివిజన్లలో గల అటవీ భూముల వినియోగానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతాలలో భూములను అటవీశాఖకు కేటాయించింది. ఈ ప్రాజెక్టును డిశంబర్ 2018నాటికల్లా నిర్మాణం పూర్తి చేసి నీళ్ళు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోంది. ఇప్పుడు అన్ని అనుమతులు లభించాయి కనుక పనులు వేగవంతం చేయవచ్చు.
జిల్లాలు వారిగా అటవీ భూముల కేటాయింపులు ఈవిధంగా ఉన్నాయి:
యాదాద్రి భువనగిరి: యాదాద్రి డివిజన్ లో 109.57 హెక్టార్లు,
జయశంకర్ భూపాలపల్లి: మహాదేవ పూర్ డివిజన్ లో 338.48 హెక్టార్లు
రాజన్న సిరిసిల్ల : కరీంనగర్-సిరిసిల్ల డివిజన్ లో 44.95 హెక్టార్లు
నిజామాబాద్: నిజామాబాద్ డివిజన్ లో 323.36 హెక్టార్లు
కామారెడ్డి: బాన్స్ వాడ డివిజన్ లో 26.6 హెక్టార్లు
మెదక్: మెదక్ డివిజన్ లో194.07 హెక్టార్లు
నిర్మల్: నిర్మల్ డివిజన్ లో 322.55 హెక్టార్లు
సిద్ధిపేట: సిద్ధిపేట డివిజన్ లో 1407.43 హెక్టార్లు
మొత్తం 3168.13 హెక్టార్లు