ఏపి తెదేపా ఎంపి జెసి దివాకర్ రెడ్డిపై పలు విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. అయన గురువారం విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరినప్పుడు విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకోవడంతో సిబ్బంది ఆయనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. దానితో ఆయన వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఎంపినని కనుక తప్పనిసరిగా బోర్డింగ్ పాస్ ఇవ్వాల్సిందేనని అధికారులతో వాగ్వాదం చేశారు. ఆ ఆవేశంలో అక్కడ బల్లపై ఉన్న ప్రింటర్ ను తీసి విసిరికొట్టేందుకు సిద్దపడ్డారు. చివరికి అధికారులే వెనక్కు తగ్గి ఆయనకు అదే విమానంలో ప్రయాణించేందుకు బోర్డింగ్ పాస్ జారీ చేయవలసివచ్చింది.
ఇదివరకు మహారాష్ట్రలో శివసేన ఎంపి గైక్వాడ్ విమానాశ్రయ అధికారిని చెప్పుతో కొట్టిన తరువాత ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సదరు వ్యక్తులపై విమానయాన సంస్థలు తగుచర్యలు తీసుకొనేందుకు చట్టం రూపొందించారు. దాని ప్రకారం విమానయాన సంస్థలు ఆ వ్యక్తులు తమ విమానాలలో ప్రయనించకుండా కనీసం 3 నెలల నుంచి శాస్వితంగా నిషేదించవచ్చు. కనుక ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్ లైన్స్ తెదేపా ఎంపి జెసి దివాకర్ రెడ్డి మూడు నెలల పాటు తమ విమానాలలో ప్రయానించడానికి అనుమతించబోమని ప్రకటించాయి.
ఇప్పటికే మంత్రులు, ఎంపిలు కీచులాటలు, పరస్పర ఆరోపణలతో అప్రదిష్టపాలవుతున్న తెదేపా సర్కార్ కు జెసి దివాకర్ రెడ్డి నోటి దురుసుతో మరింత అప్రదిష్ట తెస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, పార్టీకి తలనొప్పిగా మారారు.