రాష్ట్రపతి పదవికి ఆరుగురు నామినేషన్లు!!!

రాష్ట్రపతి పదవికి ఎన్నికల కమీషన్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటిరోజే ఆరుగురు వ్యక్తులు రాష్ట్రపతి పదవికి నామినేషన్లు వేశారు. వారిలో తెలంగాణా రాష్ట్రానికి చెందిన బాలరాజ్ అనే వ్యక్తి కూడా ఒకరు. ఈనెల 28తో నామినేషన్లు వేయడానికి గడువు ముగుస్తుంది కనుక ఎన్డీయే, యూపియే కూటములలో హడావుడి మొదలైంది. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలతో కూడిన త్రిసభ్య కమిటీ ప్రతిపక్షాలతో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్ధిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీని కోసం త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా ప్రధాన ప్రతిపక్ష నేతలందరిని కలిసి మాట్లాడుతామని వెంకయ్య నాయుడు చెప్పారు. 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 24తో ముగుస్తుంది. కనుక జూలై 17న ఎన్నికలు నిర్వహించి 20న ఫలితాలు ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనా ఇంతవరకు ఎన్డీయే, యూపియే కూటములు తమ అభ్యర్ధుల విషయంలో చాలా గుంభనంగా వ్యవహరిస్తుండటం విశేషం. మరొక నాలుగైదు రోజులలోగానే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరనే విషయంపై స్పష్టత వస్తుంది. దానిని బట్టి ప్రతిపక్షాలు తమ అభ్యర్ధిగా ఎవరిని నిలబెట్టాలి? అసలు నిలబెట్టాలా..వద్దా అని నిర్ణయించుకోవాలని ఎదురుచూస్తున్నాయి.