ఫిరాయింపుదారులకు ప్రభుత్వ భూములు?

ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇతర పార్టీల నుంచి తెరాసలోకి ఫిరాయించిన వారికి   ఆయన హైదరాబాద్ లో విలువైన ప్రభుత్వ భూములు అప్పనంగా ఇచ్చారని ఆరోపించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలో జానారెడ్డి, షబ్బీర్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వి హనుమంతరావు, తదితర కాంగ్రెస్ నేతలు బుధవారం మియాపూర్ లో అక్రమ రిజిస్ట్రేషన్లు అయిన భూములను సందర్శించారు. 

ఈ సందర్భంగా ఉత్తం కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెరాసలోకి ఫిరాయించిన కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు 10 ఎకరాలు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమార్తె కవితకు 4 ఎకరాలు కట్టబెట్టినమాట నిజమా కాదా? ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసిన మాట వాస్తవమా కాదా? ఒకవైపు దీనిపై పోలీసులు విచారణ జరుపుతుంటే, దీనిలో ఒక్క గజం భూమి కూడా ప్రభుత్వం కోల్పోలేదని..ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి నష్టపోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవిధంగా చెపుతున్నారు?ఇంత బారీ కుంభకోణం జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ అసలేమీ జరగలేధన్నట్లు మాట్లాడటం గమనిస్తే ఈ వ్యవహారంలో ఆయనే తెర వెనుక ఉండి అంతా నడిపిస్తున్నారని స్పష్టం అవుతోంది. ఈ కేసును సిబిఐకు అప్పగిస్తే ఈ తెర వెనుక బాగోతాలన్నీ బయటపడుతాయనే భయంతోనే సిఐడితో దర్యాప్తు చేయించి, తరువాత ఈ కేసును కూడా పాత కేసులలాగే మెల్లగా అటకెక్కించేయాలని చూస్తున్నారు,” అని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. 

సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ, “కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ కుంభకోణంపై సిబిఐ  దర్యాప్తు కోరి తన నిజాయితీని నిరూపించుకొంటే బాగుంటుంది. లేకుంటే ప్రజలే తగిన సమయంలో తగినవిధంగా బుద్ధి చెపుతారని హెచ్చరించారు. 

షబ్బీర్ అలీ మాట్లాడుతూ, “ఈ కుంభకోణంలో ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరుగలేదని చెప్పడం ద్వారా సిఐడి పోలీసుల దర్యాప్తును కూడా కేసీఆర్ ప్రభావితం చేస్తున్నారు. తక్షణమే దీనిపై సిబిఐ  దర్యాప్తుకు అంగీకరించాలి. ఒక్క గజం కూడా పోలేదని ఎవరు చెప్పారో తెలియజేయాలి,” అని ప్రశ్నించారు.