తెలంగాణా వైకాపా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా ప్రధాన కార్యాలయం లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్..ఇప్పుడు ఎనివేర్ కరప్షన్ గా మారిపోయింది. మియాపూర్ భూకుంభకోణంపై సి.ఐ.డి.విచారణ కాదు.. సిబిఐ చేత విచారణ జరిపించాలి. అప్పుడే ఈ కుంభకోణం సూత్రధారులు ఎవరో బయటపడతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అశ్రద్ధ కారణంగానే తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అంతగా చెలరేగిపోయి హైదరాబాద్ లో అన్ని భూదందాలు చేయగలిగాడు. కేసీఆర్ హామీలు అమలుచేయడంలో వైఫల్యం చెందారు. వాటి గురించి ఈ నెల 22న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో చర్చిస్తాము. ప్లీనరీ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 8,000 మంది రాబోతున్నారు. ప్లీనరీకి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతారు. ఆ సమావేశంలో మా పార్టీ భవిష్యకార్యాచరణను నిర్ణయించుకొని ముందుకు సాగుతాము. తెలంగాణాలో మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇకపై గట్టిగా కృషి చేస్తాము,” అని అన్నారు.