వాళ్ళకు హైకోర్టు బెయిల్ నిరాకరణ

మియాపూర్ భూకుంభకోణం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పిఎస్.పార్ధసారధి, పివిఎస్ శర్మలకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. వారు మొదట కూకట్ పల్లి కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కోర్టు వారి అభ్యర్ధనను తిరస్కరించడంతో వారు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకొన్నారు. కానీ అక్కడా వారికి చుక్కెదురైంది. వారి బెయిల్ పిటిషన్ ను విచారణకు చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు, ఈ కుంభకోణంపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయడం విశేషం.

ప్రాధమిక సాక్ష్యాధారాలను బట్టి ఈ రూ.700 కోట్ల భూకుంభకోణంలో వారిరువురికీ ప్రమేయం ఉందని నమ్ముతున్నామని కనుక వారికి బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రకృతి మానవుడికి ప్రసాదించిన గొప్ప సహజ వనరు భూమి. దానిని ఇటువంటి వారి నుండి కాపాడుకోవలసిన అవసరం చాలా ఉందని అన్నారు. పిటిషనర్లకు చెందిన ట్రినిటీ ఇన్ ఫరా వెంచర్స్ లిమిటెడ్ మరియు సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ కంపెనీలు అసలైన కంపెనీలేనా లేక ఈ కుంభకోణం కోసమే సృష్టించిన సూట్ కేసు కంపెనీలా అనే అనుమానం కూడా ఉందని, అది పోలీస్ దర్యాప్తులో బయటపడుతుందని న్యాయమూర్తి అనడం గమనిస్తే, ఈ కుంభకోణానికి పాల్పడినవారిని ఉపేక్షించకూడదనే భావన కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం కూడా ఇంతే కటినంగా, పారదర్శకంగా వ్యవహరించినప్పుడే దీని వెనుకున్న అసలైన దోషులను పట్టుకొని శిక్షించడం సాధ్యం అవుతుంది.