జగన్ ను కలిసిన మంత్రి ఈటెల!

రాజకీయ నేతలు నిత్యం ఒకరినొకరు ఎంతగా విమర్శించుకొన్నప్పటికీ కొన్ని సందర్భాలలో చాలా స్నేహపూర్వకంగా మెలిగే వారి తీరు చూస్తే వారు చేసుకొనే విమర్శలు నిజమేనా కాదా? అనే అనుమానం కలుగక మానదు. ఏపి, తెలంగాణా రాష్ట్రాల మద్య కొనసాగుతున్న వివాదాలలో ఇరు రాష్ట్రాల మంత్రులు నిత్యం ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడుపై తెరాస నేతలు ఎ స్థాయిలో విమర్శలు చేస్తుంటారో అందరికీ తెలుసు. కానీ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ విజయవాడ వెళ్ళి చంద్రబాబుని, మంత్రులను, తెదేపా నేతలను తన కొడుకు నితిన్ వివాహానికి రమ్మనమని ఆహ్వానించారు. వారు కూడా ఆయనకు ఘనంగా మర్యాదలు చేశారు. వెలగపూడిలో నిర్మించుకొన్న తమ నూతన సచివాలయం, శాసనసభ భవనాలకు తీసుకువెళ్ళి చూపించారు. వారి ప్రేమాభిమానాలు చూసినవారికి వీరేనా ఇంతకాలం ఒకరినొకరు నోరారా తిట్టుకొన్నది. కేసులు బనాయించుకొన్నది? అనే అనుమానం కలుగకమానదు. 

ఆ తరువాత మంత్రి ఈటెల నిన్న లోటస్ పాండ్ కు వెళ్ళి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిసి తన కుమారుడు పెళ్ళికి ఆహ్వానించారు. ఏపిలో జరిగే ఏదైనా ప్రభుత్వ శుభకార్యక్రమానికి తెదేపా మంత్రులు ఆహ్వానించడానికి వచ్చినప్పుడు మొహం చాటేసే జగన్, మంత్రి ఈటెలను మాత్రం సాదరంగా ఆహ్వానించి అన్ని మర్యాదలు చేసి పంపారు. వైకాపా కూడా తెరాస సర్కార్ పై అప్పుడప్పుడు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ అవేవీ వారి కలయికకు అడ్డుకాలేదు. 

తరువాత తెరాస సర్కార్ కు బద్ధ శత్రువుగా భావిస్తున్న తెలంగాణా తెదేపా, కాంగ్రెస్ నేతలను ఈటెల ఆహ్వానించవచ్చు. ఒకవేళ ఈటెల ఆహ్వానిస్తే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి వంటివారు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.