వారసత్వ ఉద్యోగాలను కల్పించాలని కోరుతూ సింగరేణి బొగ్గు కార్మికులు గురువారం నుంచి సమ్మె మొదలుపెట్టబోతున్నారు. అయితే అధికార తెరాసకు అనుబంధ సంస్థ మాత్రం ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. సమ్మె వలన సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా జటిలం అవుతుందని, పైగా సింగరేణికి బారీ నష్టం కలుగుతుందని తెరాస అనుబంద సంఘ నేతలు వాదిస్తున్నారు. కానీ వారు కార్మికులకు నష్టం కలుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తరపున యాజమాన్యంతో కుమ్మక్కై సమ్మెను విచ్చినం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేస్తే గట్టిగా ప్రతిఘటిస్తామని సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. వారసత్వ ఉద్యోగాలు కల్పించే విషయంలో మంగళవారం అర్దరాత్రి వరకు కార్మిక సంఘాలకు, సింగరేణి యాజమాన్యానికి మద్య చర్యలు జరిగాయి. కానీ అవి ఫలించకపోవడంతో రేపటి నుంచి సమ్మె ప్రారంభించాలని ఎ.ఐ.టి.యు.సి., సి.ఐ.టి.యు.సి., హెచ్.ఎం.ఎస్., బి.ఎం.ఎస్. కార్మిక సంఘాలు నిర్ణయించాయి. తమ డిమాండ్ నెరవేరేవరకు సమ్మె కొనసాగిస్తామని వారు తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం తరపున జనరల్ మేనేజర్ (పర్సనల్ డిపార్ట్ మెంట్) పవిత్రన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “కార్మికులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల కల్పనకు అంగీకరించి నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ దానిని న్యాయస్థానాలు వ్యతిరేకించాయి. న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్న అంశంపై హామీ ఇమ్మని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టడం సబబు కాదు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు మన ముందు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవడమే విజ్ఞత అనిపించుకొంటుంది. చట్టపరమైన అవరోధాలు ఉన్నప్పుడు సమ్మెతో సమస్యలు పరిష్కారం కావు. సమ్మె వలన సింగరేణి సంస్థ నష్టపోతే కార్మికులు కూడా నష్టపోతారు. కనుక సమ్మెపై పునరాలోచించుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.