సిద్ధిపేటలో మరో ఎస్.ఐ. ఆత్మహత్య

సిద్ధిపేటజిల్లా, కొండపాక మండలం కుక్కునూరు పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ.గా పని చేస్తున్న ప్రభాకర్ రెడ్డి బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్ లో తన గదిలోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఉన్నతాధికారుల వేధింపులను భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకొన్నట్లు కుటుంబ సభ్యులు చెపుతున్నారు.

గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ.గా పనిచేసిన రామకృష్ణారెడ్డి కూడా ఇదే కారణంతో ఇదేవిధంగా అదే గదిలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన స్థానంలో భాద్యతలు చేపట్టిన ప్రభాకర్ రెడ్డి ఏడాది పూర్తి కాకమునుపే ఆత్మహత్య చేసుకోవడం గమనిస్తే ఆ స్టేషన్ లో పనిచేసే పోలీస్ అధికారులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి 2012 బ్యాచ్ కు చెందిన అధికారి. ఆయన శిక్షణ పూర్తి చేసుకొన్న తరువాత మల్కాజ్ గిరి, శామీర్ పేట, కౌడిపల్లి పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 2016 ఆగస్ట్ 26న కుక్కునూరు పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ.గా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 10 నెలల వ్యవధిలో ఒకే పోలీస్ స్టేషన్ లో వరుసగా ఇద్దరు ఎస్.ఐ.లు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు హైదరాబాద్ నుంచి పోలీస్ ఉన్నతాధికారులు కొద్దిసేపటి క్రితమే సిద్ధిపేటకు చేరుకొన్నారు.