సకల జనులారా ఇక శలవు!

తెలుగు బాషకు, సినీ పరిశ్రమకు తన కలంతో కొత్త వన్నెలద్దిన మహాకవి సి. నారాయణరెడ్డి (సినారె) అంత్యక్రియలు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. తెలుగువారు గర్వించదగ్గ ఆ మహాకవికి అంతిమ వీడ్కోలు పలికేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు. ఆయనతో బాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ, సాహితీ, పత్రికా రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు, సినారె అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. సినారె పెద్ద కుమార్తె గంగ కుమారుడు చైతన్య ప్రసాద్ తాతగారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

సుమారు  ఆరు దశాబ్దాలు అలుపెరుగకుండా సాగిన ఆయన కలం నిలిచిపోయింది. అలవోకగా ఆశుకవిత్వాలు ఒలికించిన ఆయన గొంతు మూగపోయింది. మాటైనా, పాటైనా దేనికదే సాటి అన్నట్లు ఆశుధారలుగా సాగే ఆ ప్రవాహం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఇక మిగిలినవి ఆయన జ్ఞాపకాలు..ఎన్నిసార్లు పాడుకొన్నా తనివి తీరని వేలాది పాటలు. ఆయన సృజించిన ఆ సాహిత్యమే అయనను ప్రజల మనసులలో అజరామరంగా నిలిపి ఉంచుతుంది. మహాకవి సినారెకు తెలుగు ప్రజలందరి తరపున ఇదే అశ్రునివాళి.