తెరాస సర్కార్ ను పట్టి కుదిపివేస్తున్న భూకుంభకోణం కేసులో తెరాస నేతల పేర్లే వరుసగా బయటపడుతుండటం విశేషం. దండుమైలారం ప్రభుత్వ భూముల కొనుగోలు వ్యవహరంలో తెరాస రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పేరు బయటపడిన సంగతి తెలిసిందే. తరువాత ఇప్పుడు తెరాసకే చెందిన మరో రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ పేరు బయటకు వచ్చింది. ఆయన మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ మండలంలోని గిర్మాపూర్ గ్రామంలో పేదలకు కేటాయించబడిన ప్రభుత్వ అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన సంగతి తాజాగా బయటపడింది.
గౌడవెల్లి-రాయిలాపూర్ రోడ్డులో సర్వే నెంబర్ 221 క్రింద 8.9 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. దానిని సుమారు 4 దశాబ్దాల క్రితం ఆ గ్రామంలో నిరుపేద ముదిరాజ్ కులస్తులకు ప్రభుత్వం కేటాయించింది. అది ప్రభుత్వ అసైన్డ్ భూమి కనుక ఎవరికీ అమ్మడానికి వీలులేదు. కానీ అది మద్యలో అనేక చేతులు మారింది. ఆ కారణంగా రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి కొన్నేళ్ళ క్రితం సదరు యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు.
ఆ తరువాత కూడా ఆ భూమిని కొనుగోలు చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించినప్పుడు అది అసైన్డ్ భూమి కనుక కొనుగోలు, అమ్మకాలు కుదరవని అధికారులే స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అదే భూమిని డి శ్రీనివాస్, ఆయన సన్నిహితుడు ఏవి సత్యనారాయణ కలిసి 2015లో కొనుగోలు చేశారు. దానిలో డిఎస్ పేరిట 4 ఎకరాలు, మిగిలింది సత్యనారాయణ పేరిట మేడ్చల్ ఎస్.బి.ఐ. రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. అప్పుడు అధికారులు ఎవరూ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడం విశేషం.
డిఎస్ జూలై 2105లో కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరారు. ఆ తరువాతే ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. దీనిపై తెరాస సర్కార్ ఏమి సమాధానం చెపుతుందో చూడాలి.