ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ భూముల కొనుగోలు వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు, తెరాస సెక్రెటరీ జనరల్ కె. కేశవరావు పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా ఉన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ నుంచి కేకె కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 50 ఎకరాలలో 38 ఎకరాలు ప్రభుత్వ భూములేనని మీడియాలో వస్తున్న వార్తలను ఆయన గట్టిగా ఖండించారు. అయితే దానిపై రెవెన్యూ శాఖ జరిపిన ప్రాధమిక దర్యాప్తులో అవి ప్రభుత్వ భూములేనని తేలడంతో ఆయన కుటుంబ సభ్యుల పేరిట జరిగిన ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఇదే విషయం తెలియజేస్తూ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే, ఈ బారీ భూకుంభకోణంలో అదికార పార్టీకి చెందిన నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమని దృవీకరించినట్లు అవుతుంది.