కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఆయనకు ఒక బలహీనత ఉంది. అదేమంటే ఫోటో సెషన్ తరువాత తను దేని గురించి పోరాడుతున్నారో, ఏమి హామీలు ఇచ్చామో మరిచిపోతుంటారు. హైదరాబాద్ యూనివర్సిటీ, జె.ఎన్.యు., మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ రైతుల ఆందోళనలు ఇలాగ ఏదో ఒక అంశంపై పోరాడటానికి బయలుదేరుతారు. కానీ ఫోటోలు తీయించుకోవడంపై ఉన్న ఆసక్తి మరిదేని మీద ఉండదు. ఫోటో సెషన్ పూర్తవగానే అన్నీ మరిచిపోతుంటారు. అందుకే ఒకసారి మాట్లాడిన విషయం గురించి మళ్ళీ మాట్లాడరు,” అని అన్నారు.
తమ ప్రభుత్వం గురించి చెపుతూ, “ఒక సాధారణ ఛాయ్ వాలా మోడీ ప్రపంచంలో అన్ని దేశాలలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకనే మా ప్రభుత్వంపై నిత్యం బురద జల్లే ప్రయత్నాలు చేస్తోంది. అయితే మా ఓవర్ హెడ్ ట్యాంక్ (ప్రధాని నరేంద్ర మోడీ) చాలా పరిశుభ్రంగా ఉంది. కనుక ఈ మూడేళ్ళలో అవినీతి ఆరోపణలు వినపడలేదు. అదే..కాంగ్రెస్ హయంలో రోజుకొక కుంభకోణం బయటపడుతుండేది. విజయ్ మాల్యకు వేలకోట్లు అప్పులిప్పించిన ఘనత కూడా యూపియే ప్రభుత్వానిదే. ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీళ్లు కార్చుతున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్నప్పుడు వారి కోసం ఏమి చేశారో ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ హయంలో దేశంలో అన్ని రంగాలతోబాటు వ్యవసాయ రంగాన్ని కూడా భ్రష్టు పట్టించారు,” అని విమర్శించారు.