హైదరాబాద్ లో బాలికలు అదృశ్యం

హైదరాబాద్ నగరంలో గత వారం రోజులలో వరుసగా నలుగురు బాలికలు అదృశ్యం అయ్యారు. అందరూ 10వ తరగతి చదువుతున్నవారో లేదా పాస్ అయినవారో కావడం విశేషం. అంటే 14-15 ఏళ్ళ వయసున్న బాలికలే అదృశ్యం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. మొదట నిజాంపేట్ కు చెందిన యామిని అనే బాలిక ఈనెల 7న స్కూలుకు వెళ్ళి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా చివరికి ఆమె వారి బంధువుల ఇంటిలో ఉన్నట్లు కనుగొన్నారు.

ఆ కేసు పరిష్కరించి పోలీసులు ఊపిరి పీల్చుకొనేసరికి మూడు రోజుల క్రిందట పూర్ణిమ అనే 10వ తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమైంది. పోలీసులు ఆమె కోసం వెతుకుతుండగానే నిన్న హైదరాబాద్ లో మరో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. వారిలో దుర్గాదేవి అనే బాలిక నిజాంపేటకు చెందినదే కావడం విశేషం. ఆమె నిన్న సాయంత్రం కిరాణా దుఖాణానికి వెళ్ళి ఇంతవరకు తిరిగిరాలేదు. దీనితో ఆమె తల్లి తండ్రులు కూడా పోలీసులకు పిర్యాదు చేశారు. ముగ్గురు బాలికల కోసం 14 పోలీసుల బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బాలికల అదృశ్యం వెనుక ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కనుక నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం మంచిది.