మియాపూర్ భూకుంభకోణం వెలుగుచూసి మూడు వారాలు అవుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు దానిపై స్పందించకపోవడాన్ని తెదేపా తప్పు పట్టింది. ఆ కేసును సిబిఐకు అప్పగించి నిందితులందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న తెదేపా నేతలు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “700 ఎకరాల ప్రభుత్వభూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు చేసినట్లు బయటపడి మూడు వారాలు గడిచినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. ఈ కుంభకోణంలో దోషులను పట్టుకొని శిక్షించాలనుకొంటే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి లేకుంటే ఈ కేసును కూడా మిగిలిన కేసుల మాదిరిగానే అటకెక్కించేయబోతున్నట్లు అనుమానించవలసి వస్తుంది,” అని అన్నారు.
తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వంలో పెద్దలెవరి అండదండలు లేకుండా ఇంత పెద్ద భూకుంభకోణం జరపడం సాధ్యం కాదు. సిఎం కేసీఆర్ పేషీలో పనిచేస్తున్న ఒకవ్యక్తి ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు సమీప బంధువు. అతనే తెర వెనుక ఉండి ఈ కధ అంతా నడిపించారు. ఇంతకు ముందు ఎంసెట్ లీకేజ్ కేసును, తరువాత నయీం కేసులను ముఖ్యమంత్రి కేసీఆర్ అటకెక్కించేశారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై తక్షణం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి,” అని అన్నారు.
మియాపూర్ భూకుంభకోణంపై ప్రభుత్వం మౌనం వహించడం వలననే ప్రతిపక్షాలు ఇంత గట్టిగా ప్రశ్నించగలుగుతున్నాయనేది స్పష్టం అవుతోంది. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల వలన తెరాస సర్కార్ కు ప్రస్తుతం ఎటువంటి నష్టమూ లేకపోయినా అవి ప్రజలకు ప్రభుత్వంపై అనుమానాలు పెరిగేలా చేయడం ఖాయం కనుక ఎన్నికల సమయంలో నష్టం కలిగించవచ్చు. తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని మాటకారులైన తెరాస నేతలు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఇటువంటి అవినీతి ఆరోపణలతో చేసిన ఆ మంచిపనులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. కనుక మియాపూర్ భూకుంభకోణంపై ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవడం మంచిది. ఇక అటకెక్కించేసిన కేసుల జాబితాలో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్న ఓటుకు నోటు కేసు కూడా ఉంది. కానీ ఆవిషయం అయన ప్రస్తావించరు?