మాజీ ఎంపి విజయశాంతి కొన్ని రోజుల క్రితం బెంగళూరు వెళ్ళి జైల్లో ఉన్న శశికళను కలిశారు. ఆ తరువాత చెన్నై వెళ్ళి శశికళ మేనల్లుడు దినకరన్ తో సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా కొందరు అన్నాడిఎంకె నేతలను కూడా ఆమె కలిశారు. దీంతో ఆమె తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించబోతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు మొదలైపోయాయి. తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఆమె తమిళనాడు రాజకీయాలలో ఎలా ప్రవేశించగలరు? అది సాధ్యమా? అని ఆలోచించకుండానే ఆమె తమిలరాజకీయ ఎంట్రీపై మీడియాలో అనేక ఊహాగానాలు వచ్చేయి.
వాటిపై ఆమె స్పందిస్తూ, “తెలంగాణా రాష్ట్రానికి చెందిన నేను తమిళనాడు రాజకీయాలలో ఎందుకు ప్రవేశిస్తాను? నా గురించి వస్తున్న ఆ వార్తలన్నీ ఊహాగానాలే తప్ప నిజం కావు. ఒకప్పుడు జయలలిత నన్ను చాలా అభిమానించేవారు. నేను కూడా ఆమెను చాలా అభిమానించేదాన్ని. ఆ అభిమానంతోనే నేను బెంగళూరు, చెన్నై వెళ్ళి అన్నాడిఎంకె నేతలను కలిశాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అనేక మంచి పనులు చేశారు. చాలా గొప్ప ఆశయాలతో ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించారు. అమ్మ ద్వారా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి జరుగుతున్న కుట్రలను చూసి క్లిష్ట పరిస్థితులలో ఉన్న వారికి సంఘీభావం తెలిపేందుకే నేను వారిని కలిశాను తప్ప తమిళరాజకీయాలలో ప్రవేశించాలనే ఉద్దేశ్యంతో కాదు,” అని విజయశాంతి అన్నారు.