తెదేపాకు శిల్పారెడ్డి షాక్!

ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హటాన్మరణంతో ఖాళీ అయిన కర్నూలు జిల్లాలోని నంద్యాల శాసనసభ సీటు కోసం ఆయన కుటుంబ సభ్యులకు, తెదేపా సీనియర్ నేత , మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి మద్య అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మద్యలో కలుగజేసుకొని శిల్పా మోహన్ రెడ్డికి నచ్చజెప్పి శాంతపరిచినప్పటికీ, సోమవారం ఆయన నంద్యాలలో తన అనుచరులతో సమావేశం అయిన తరువాత తెదేపాను వీడి వైకాపాలో జేరబోతున్నట్లు ప్రకటించారు. ఈనెల 14న నంద్యాల నుంచి తన అనుచరులతో కలిసి బారీ ఊరేగింపుగా హైదరాబాద్ చేరుకొని లోటస్ పాండ్ లో వైకాపా కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా పెట్టేసుకొన్నారు.

అయితే చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వ్యక్తికే ఆ సీటు వదిలిపెట్టాలనే సాంప్రదాయాన్ని  వైకాపా కూడా పాటిస్తోంది కనుక ఒకవేళ వైకాపాలో చేరినా నంద్యాల ఉపఎన్నికలలో పోటీ చేసేందుకు అనుమతించకపోతే శిల్పా మోహన్ రెడ్డి పరిస్థితి రెంటికీ చెడినట్లవుతుంది.