జయలలిత ఆకస్మిక మృతి తరువాత తమిళనాడులో జరిగిన రాజకీయ సంక్షోభం అందరికీ తెలిసిందే. శాసనసభ బలపరీక్షలో నెగ్గేందుకు పన్నీర్ సెల్వం, శశికళ ఇద్దరూ అన్నాడిఎంకె ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి ఒక్కో ఎమ్మెల్యేకు రూ.2-4 కోట్లు వరకు ఇవ్వజూపినట్లు 'టైమ్స్ నౌ' అనే జాతీయ చానల్ మరియు మూన్ టీవితో కలిసి ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి బయటపెట్టింది. న్యూస్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ లో ఎమ్మెల్యేలు బేరసారాలు చేస్తూ కెమేరాకు చిక్కారు.
పన్నీర్ సెల్వం మొదట ఒక్కొక్కరికీ కోటి రూపాయలు ఆఫర్ చేస్తే శశికళ రెండు కోట్లు+ కొంత బంగారం కూడా ఆఫర్ చేసినట్లు శరవణన్ అనే ఎమ్మెల్యే స్వయంగా బయటపెట్టాడు. ఒక సమయంలో శశికళ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.4 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్దపడినట్లు చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు మొత్తం రూ.10 కోట్లు ముట్టాయని చెప్పారు. శరవణన్ మొదట శశికళకు మద్దతు ఇచ్చారు. కానీ ఆమె మహాబలిపురం గోల్డెన్ రిసార్ట్ లో ఎమ్మెల్యేలను నిర్బంధించి ఉంచినప్పుడు, ఆయన మారువేషంలో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పన్నీర్ సెల్వం పంచన చేరారు. ప్రస్తుతం ఈ వార్త తమిళరాజకీయాలలో కలకలం రేపుతోంది. జయలలిత మృతి చెందినప్పటి నుంచి అన్నాడిఎంకే నేతలపై అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కనుక ఈ వీడియో క్లిప్పింగ్ ఆధారంగా ఒకవేళ ఎన్నికల సంఘం విచారణ మొదలుపెడితే అన్నాడిఎంకేలో అందరికీ ఇబ్బందే. ఈ మిషతో రాష్ట్రప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనా విదించినా ఆశ్చర్యం లేదు.
ఓటుకు నోటు కేసులో తెదేపా ఎమ్మెల్సీకి మద్దతు ఇచ్చేందుకు నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు తెదేపా రూ.50 లక్షలు నగదు అడ్వాన్స్ గా ఇచ్చి పట్టుబడిన సంగతి తెలిసిందే. స్టీఫెన్ సన్ కు రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. పైగా ఇక్కడ స్టీఫెన్ సన్ మద్దతుతో తెదేపా ఎమ్మెల్సీ గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. అదే..తమిళనాడులో ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది. అయినా స్టీఫెన్ సన్ కు తెదేపా రూ.5 కోట్లు ఆఫర్ ఇవ్వడం విశేషం. నిజంగా ప్రజాసేవ చేయడానికే అయితే అన్ని కోట్లు చెల్లించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవలసిన అవసరం ఉందా? అంటే సమాధానం అందరికీ తెలుసు.