పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్యకు సోమవారం గుండెపోటు వచ్చింది. తక్షణం ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రామయ్య గత 43 ఏళ్ళుగా జిల్లా అంతటా మొక్కలు నాటడమే జీవిత ధ్యేయంగా జీవిస్తున్నారు. సర్వశక్తులు కలిగిన ప్రభుత్వమే చేయలేని పని ఆయన ఒక్కరే చేశారు. అదేమిటంటే ఖమ్మం జిల్లాలో కోటి మొక్కలు నాటడమే కాకుండా అవి మహా వృక్షాలుగా ఎదిగే వరకు వాటి సంరక్షణ కూడ చేశారు. ఆయన కారణంగా ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఆయన భార్య జానకమ్మ కూడా అక్షరాల అర్ధాంగి అనే మాటకు అర్ధంగా నిలిచి భర్తకు అన్ని విధాల సహకరించారు. వారి సేవను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఈ ఏడాదే మొక్కల రామయ్యకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అటువంటి వ్యక్తి మనకు చాలా అవసరం. కనుక రామయ్య త్వరగా కోలుకొని ఇంటికి తిరిగివచ్చి మళ్ళీ మహా యజ్ఞాన్ని కొనసాగించాలని కోరుకొందాము.