ఇంతవరకు రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో చాలా గుంభనంగా వ్యవహరించిన ఎన్డీయే కూటమిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో కదలిక మొదలైంది. రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక కోసం కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడుల కూడిన ఒక కమిటీని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏర్పాటు చేశారు. వారు ఎన్డీయే కూటమిలో మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపి తమ అభ్యర్ధిని సూచిస్తారు. ఆ తరువాత అవసరమైతే రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేందుకు యూపియే మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలతో కూడా వారు చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రపతి పదవీ కాలం జూలై 24తో ముగుస్తుంది. కనుక రాష్ట్రపతి ఎన్నికల కోసం ఈనెల 14 నుంచి 28 వరకు నామినేషన్లు దాఖలు స్వీకరించబడతాయి. జూలై 17న ఎన్నికలు నిర్వహించి, 20వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్డీయే కూటమి తన అభ్యర్ధిని ప్రకటించిన తరువాత దానిని బట్టి యూపియే, దాని మిత్రపక్షాలు తమ అభ్యర్ధిపై నిర్ణయం తీసుకోవాలని ఎదురుచూస్తున్నాయి. కనుక వారికి కూడా ఆమోదయోగ్యమైన అభ్యర్ధిని ఎన్డీయే ప్రతిపాదించినట్లయితే రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావచ్చు. అందుకోసం ప్రతిపక్షాలు సైతం కాదనలేని అభ్యర్ధిని నిలబెట్టవలసి ఉంటుంది. ఒకవేళ వారు కాదంటే రాజకీయంగా నష్టపోయేవిధంగా ఆ ఎంపిక ఉండాలి. కనుక రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో ఈసారి మోడీ సర్కార్ చాలా ఆచితూచి ఎంపిక చేయవచ్చు.
కానీ వరుస విజయాలతో దూసుకుపోతూ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న భాజపాకు, మోడీ సర్కారును కట్టడి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు రాష్ట్రపతి ఎన్నికలలో తమ సత్తా చూపాలని గట్టి పట్టుదలతో ఉన్నందున ఈ వ్యవహరం చివరికి ఏ మలుపు తిరుగుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం.