మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రంలో రైతుల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఐదెకరాలలోగా పొలం ఉన్నవారికి తక్షణం పూర్తిగా పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకంటే ఎక్కువ ఉన్నవారికి ఎంత మాఫీ చేయాలనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వలన ఆ రాష్ట్రంలో సుమారు 70 శాతం మంది రైతులు రుణవిముక్తి పొందుతారు. అయితే దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై రూ.40,000 కోట్లు అదనపు భారం పడబోతోంది.
మధ్యప్రదేశ్ లో రైతులు పంట రుణాల మాఫీ చేయమని ఆందోళనలు మొదలుపెట్టడంతో ఆ ప్రభుత్వం రుణాలపై వడ్డీలు మాత్రమే మాఫీ చేయగలమని చెపుతోంది. కానీ ఈ వేడి ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కూడా పాకడంతో మహారాష్ట్రలో రైతులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయగానే, మధ్యప్రదేశ్ ప్రభుత్వంలాగ సమస్య జటిలం కాకనునుపే చురుకుగా స్పందించి పంట రుణాలమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి రైతుల మన్ననలు పొందగలిగింది.
పంటరుణాల మాఫీ చేయడం ఒక తప్పనిసరి విధానంగా మారిపోవడం వలన ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి తారుమారు అయ్యే ప్రమాదం ఉంటుందని ఆర్ధిక రంగ నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ కూడా పదేపదే హెచ్చరిస్తోంది. విజయ్ మాల్యా వంటి బడా పారిశ్రామికవేత్తలకు వేలకోట్లు మాఫీ చేస్తున్నప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు ఆ మాత్రం సాయం చేయలేరా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.