కేంద్ర ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన నిన్న డిల్లీలో జరిగిన జి.ఎస్.టి.కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఆ సమావేశంలో వివిద వస్తువులపై ఎంత పన్ను వేయాలనే విషయంపై తను చేసిన సూచనలు, సలహాలను అరుణ్ జైట్లీ పట్టించుకొనందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులను జి.ఎస్.టి. నుంచి మినహాయింపు ఇవ్వవలసిందిగా కోరగా అరుణ్ జైట్లీ పట్టించుకోలేదని అన్నారు. తను మొత్తం 34 వస్తువులు, సేవలపై పన్ను విధింపుపై సూచనలు ఇస్తే వాటిలో రెండింటిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని సినీ పరిశ్రమ, కళ్ళద్దాలపై పన్ను తగ్గించిందని చెప్పారు.
గ్రానైట్ పరిశ్రమపై 28 శాతం పన్ను విధిస్తే అది సంక్షోభంలో పడుతుందని చెప్పిన అరుణ్ జైట్లీ పట్టించుకోలేదని అన్నారు. డయాబెటిస్ రోగులు నిత్యం ఉపయోగించే ఇన్సులిన్ పై ముందు 12 శాతం విధించిన పన్నును ౫ శాతానికి తగ్గించారని చెప్పారుసామాన్యులు ఉపయోగించి ఫ్యానులకు, కాస్త ఉన్నవాళ్ళు ఉపయోగించే ఏసీలకు ఒకే పన్ను విధించడం గమనిస్తే జి.ఎస్.టి.లో హేతుబద్దత కొరవడిందని అర్ధం అవుతోందని అన్నారు. వివిధ రాష్ట్రాల తరపు వచ్చిన ఆర్ధిక మంత్రులు చేసిన ఇటువంటి చాలా ప్రతిపాదనలను అరుణ్ జైట్లీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం చాలా బాధాకరం అని అన్నారు.
ఇప్పటి వరకు జరిగిన జి.ఎస్.టి.కౌన్సిల్ సమావేశాలలో దాదాపు అన్ని రకాల వస్తువులు, సేవలపై పన్నులను ఖరారు చేశారు కనుక నిన్న జరిగిన సమావేశమే చివరిది. కనుక జి.ఎస్.టి.లో ఇక ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. ఈ నూతన ఏకీకృత పన్ను విధానాన్ని జూలై 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమలుచేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి.