మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేటి నుంచి భోపాల్ లో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చొన్నారు. రాష్ట్రంలో మళ్ళీ ప్రశాంత పరిస్థితులు ఏర్పడేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా “ఈ రాష్ట్రం నాకో దేవాలయం వంటిది. ప్రజలు నాకు దేవుళ్ళు. వారికి కష్టం కలిగితే నాకు కలిగినట్లే” అని అన్నారు.
రాష్ట్రంలో కొన్ని సమస్యలున్నాయని వాటిని పరిష్కరించేందుకు యధాశక్తిన ప్రయత్నిస్తున్నానని అన్నారు. వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కారం అయ్యాయని మరికొన్ని త్వరలో పరిష్కరిస్తానని అన్నారు. రైతులు నేరుగా తనను కలిసి తమ సమస్యల గురించి చెప్పవచ్చని అన్నారు.
కానీ ఆరుగురు రైతులను పొట్టన పెట్టుకొన్నందుకు సర్వత్రా విమర్శలు ఎదుర్కోవలసి వస్తున్నందున, ప్రజల దృష్టి మళ్ళించడానికే ఈ కపటనాటకం మొదలుపెట్టారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించాలి కానీ ఈవిధంగా నిరాహార దీక్షలు చేయడం ఏమిటని జెడియు అధినేత శరద్ యాదవ్ ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకుండా దీక్షలు చేయడానికే ఆయనకు ప్రజలు అధికారం కట్టబెట్టారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిరాహారదీక్ష చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ఈ విమర్శల సంగతి ఎలా ఉన్నా, రైతుల సమస్యలు పరిష్కరించకుండా ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేస్తే రైతులు ఆందోళన చేయడం మానుకొంటారా? ఆయన రైతులకు హామీ ఇచ్చి వారిచేత ఆందోళనలను విరమింపజేసే బదులు ఆయనే నిరాహార దీక్షకు కూర్చొంటే ఆయనకు ఎవరు ఎప్పుడు ఏ హామీ ఇచ్చి దీక్ష విరమింపజేయాలి? అని ఆలోచిస్తే సమాధానం దొరకదు.