త్వరలో కోదండరాముడి దండయాత్ర?

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకొన్నారు. మూడు నెలలు ఏకధాటిగా సాగే ఈ పర్యటనలో 119 నియోజకవర్గాలలో పర్యటించి, ప్రజా సమస్యలపై, ప్రాజెక్టుల పురోగతిపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. రేపు రంగారెడ్డి జిల్లాలో తురకంజియాల్ లో జరుగబోయే టిజెఎసి సమావేశంలో ఆయనపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

తెరాస మంత్రులు, నేతలు అందరూ తమ ప్రభుత్వ హయంలో రాష్ట్రం చాలా దివ్యంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజలందరూ సంతృప్తిగా..సంతోషంగా ఉన్నారని చెపుతుంటారు. కానీ ప్రొఫెసర్ కోదండరామ్ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని వాటిని అధ్యయనం చేయడానికని బయలుదేరుతున్నారు. అంటే తెరాస సర్కార్ లోపాలను ఎత్తి చూపడానికేనని స్పష్టం అవుతోంది. తమ ప్రభుత్వాన్ని ఎవరు వేలెత్తి చూపినా సహించలేని స్థితిలో ఉన్న తెరాస నేతలు ఆయన తమపై దండయాత్రకు బయలుదేరినట్లుగానే భావించడం సహజం..ఆయన వేలెత్తి చూపిన వెంటనే ఆయనపై మూక్కుమ్మడిగా ఎదురుదాడి చేయడం కూడా అనివార్యమే. కనుక ప్రొఫెసర్ కోదండరామ్ రాష్ట్ర పర్యటనతో రాష్ట్రంలో రాజకీయాలు మళ్ళీ వేడెక్కడం ఖాయమనే భావించవచ్చు.