రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ శనివారం మంచిర్యాల్ జిల్లాలో బెల్లంపల్లి వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు శంఖుస్థాపన చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణా ఇస్తే మీరేమి చేసుకొంటారు? మీకు పాలించుకోవడం చేతకాదు అంటూ కొంతమంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు మనల్ని భయపెట్టారు. కానీ తెలంగాణా వస్తే ఏమి చేసుకొంటామో ఈ మూడేళ్ళలోనే చూపించి వారందరి నోళ్ళు మూయించగలిగాము.
గతంలో తెదేపా హయంలో నెలకు రూ.70లు పెన్షన్ ఇస్తే, తరువాత వచ్చిన కాంగ్రెస్ నెలకు రూ.200 ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2.90 లక్షల మందికి పెన్షన్ ఇస్తే మేము 4 లక్షల మందికి ఇస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సారానికి రూ.600 కోట్లు దీని కోసం ఖర్చు చేస్తే, మేము దానికి సుమారు రూ.5,300 కోట్లు ఖర్చు చేస్తున్నాము. అధనంగా మరో రెండు లక్షలమంది ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాము.
దీనికంతటికీ కారణం ఏమిటంటే, పెద్దపెద్దవాళ్ళు ఏదోవిధంగా సంపాదించుకొంటారు కానీ నిరుపేదలకు ఆ అవకాశం ఉండదు కనుక ముందుగా మనం వారికే సహాయపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక. అందుకే రాష్ట్రంలో నిరుపేదలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, వికలాంగులకు నెలకు రూ.1,000-1,500 పెన్షన్లు ఇస్తున్నాము.
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమలు ఏ బియ్యంతో అన్నం తింటారో అదే సన్నబియ్యం మన పేదలకు కూడా అందిస్తున్నాము. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కో కుటుంబానికి కేవలం 4 కేజీలు మాత్రమే బియ్యం అందిస్తే, నేడు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ 6 కేజీల చొప్పున అందిస్తున్నాము. ఈవిధంగా రాష్ట్రంలో నిరుపేదల కోసం ఆలోచించి పనిచేసే ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను.
మా ప్రభుత్వం ఒకపక్క రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, సామాన్య ప్రజల కోసం ఇన్ని సంక్షేమ పధకాలను అమలుచేస్తుంటే, ఓర్వలేని ప్రతిపక్షాలు మాపై లేనిపోని నిందలు వేస్తూ, అడుగడగునా అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి. మీరందరూ ఇది గమనించి సమయం వచ్చినప్పుడు వాటికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని మనవి చేస్తున్నాను,” అని అన్నారు.