భూకుంభకోణంలో కేశవరావుపై ఆరోపణలు

ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులపేరిట రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వచ్చిన ఆరోపణలలో ఒక అధికారిపై వేటు పడినసంగతి తెలిసిందే. ఆ కుంభకోణంలో తెరాస సెక్రెటరీ జనరల్ కే కేశవ్ రావు, ఆయన కుటుంబ సభ్యులపేర్లు పైకి వచ్చాయి. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణంలో అయన తన కుమార్తె, కోడలు పేరిట 50 ఎకరాలు కొన్నారు. దానిలో సర్వే నెంబర్‌ 36 లో తన కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరిట కొన్న 38 ఎకరాలు ప్రభుత్వ భూమి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆ భూములను గోల్డ్ స్టోన్ కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.     

ఈ వార్తలు, ఆరోపణలపై కేశవరావు ఈరోజు వివరణ ఇస్తూ, “పార్లమెంటు సభ్యుడిగా చట్టాలు చేసే ప్రక్రియలో నేను భాగస్వామిని. కనుక చట్టవ్యతిరేకమైన పనులకు ఎన్నడూ పాల్పడను. మేము దండు మైలారంలో 50 ఎకరాలు కొన్న మాట వాస్తవమే. వాటి పాత్రలన్నీ సక్రమంగా ఉన్నాయని దృవీకరించుకొన్న తరువాతే 2013లో అగ్రిమెంటు చేసుకొని 2015లో రిజిస్ట్రేషన్ చేసుకొన్నాము. వాటిలో ప్రభుత్వ భూమి ఒక్క సెంటు కూడా లేదని హైకోర్టు స్వయంగా స్పష్టం చేసింది. దానిని ఎవరూ తప్పు పట్టలేరు కదా? అటువంటప్పుడు ఆ భూములను కొన్న మమ్మల్ని ఎందుకు తప్పు పడుతున్నారు? ఆ భూములన్నీ చట్టప్రకారమే కొనుగోలు చేశాము తప్ప దొంగచాటుగా కొట్టేయలేదు. ఆవిధంగా చేయడానికి నేనేమి దొంగను కాను. పార్లమెంటు సభ్యుడిని. నాకు చట్టాల గురించి పూర్తి అవగాహన ఉంది. కనుక వాటిని అతిక్రమించి ప్రభుత్వ భూములను ఎందుకు కొంటాను? ఈ వ్యవహారంలో ఎవరూ సస్పెండ్ చేయబడలేదు. నాపై వస్తున్న ఆరోపణలను నేను ఖండిస్తున్నాను,” అని చెప్పారు.    

మరి అంతా సక్రమంగా ఉంటే ఇబ్రహీం పట్టణంలో ప్రభుత్వ భూములు ఏమైపోయాయి? ఎలాగా మాయం అయిపోయాయి? వాటిని ఎవరు మాయం చేసేశారు?