కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నిన్న గుండెపోటుతో మరణించారు. సీమ్లా నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక విమానం ద్వారా ఈరోజు ఉదయం హైదరాబాద్ తీసుకువచ్చారు. బంజారా హిల్స్ లో ఆయన స్వగృహంలో ఉంచిన భౌతికకాయాన్ని సందర్శించుకొని నివాళులు అర్పించేందుకు తెరాసతో సహా అన్ని పార్టీల నేతలు తరలివస్తున్నారు.
పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా పలువురు కాంగ్రెస్ నేతలు ఎంపిలు కవిత, గుత్తా సుఖేందర్ రెడ్డి, తెదేపా నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణ, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా అనేకమంది ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మరికొద్ది సేపటిలో ఆయన భౌతికకాయాన్ని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ కు తరలించి అక్కడ ప్రజల సందర్శనాంతరం నల్లగొండజిల్లాలో ఆయన స్వగ్రామం ఇడికుడిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.