ఏపిలో బాబు-మార్క్ అభివృద్ధి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘చంద్రబాబు మార్క్ అభివృద్ధి’ జరుగుతోందని తెలంగాణా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పడం చూస్తే అయన బాబును మెచ్చుకొంటున్నారో లేక ఎద్దేవా చేస్తున్నారో అనే అనుమానం కలుగకమానదు. తన కుమారుడు నితిన్ వివాహానికి ఏపి సిఎం చంద్రబాబును, ఏపి మంత్రులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించేందుకు శుక్రవారం విజయవాడ వెళ్ళిన మంత్రి ఈటెల, గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు అక్కడే ఎదురైన చంద్రబాబుకి ఆహ్వానపత్రిక అందించి కాసేపు ఆయనతో ముచ్చటించారు. 

తరువాత ఈటెల మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన పరిస్థితులను చూసి చంద్రబాబు మొదట కొంత ఆందోళన చెందినప్పటికీ మళ్ళీ తేరుకొని రాష్ట్రాన్ని తన శైలిలో అభివృద్ధి చేస్తున్నారని మెచ్చుకొన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలను అమలుచేస్తుండటంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు మార్క్ అభివృద్ధితో దూసుకుపోతోందని మెచ్చుకొన్నారు. 

అనంతరం ఏపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, పుల్లారావు, రవీంద్ర తదితరులను కలిసి మంత్రి ఈటెల వారికి కూడా వివాహ్వాన పత్రికలు ఇచ్చారు. ఆ తరువాత వెలగపూడిలో కొత్తగా నిర్మించుకొన్న ఏపి శాసనసభ భవనాన్ని సందర్శించారు. 

చంద్రబాబుపై తెరాస నేతలకు ఎటువంటి అభిప్రాయం ఉందో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా తెరాస మంత్రులు చాలా మంది ఏదో ఒక సందర్భంలో బాబుపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. అభివృద్ధిలో తెలంగాణాతో పోటీ పడలేకనే చంద్రబాబు తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ‘బ్లాక్ డే’ గా వర్ణించారని మంత్రి హరీష్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. ఏపిలో అభివృద్ధి కాగితాల మీదే తప్ప ప్రత్యక్షంగా ఎక్కడా జరగడం లేదని, తెదేపా పాలనలో అవినీతి రాజ్యం ఏలుతోందని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతలు నిత్యం విమర్శిస్తూనే ఉంటారు. ఈ నేపద్యంలో మంత్రి ఈటెల ఏపిలో ‘చంద్రబాబు మార్క్ అభివృద్ధి’ జరుగుతోందని చెప్పడం గమనిస్తే ఆయన ఆ మాట ఎ ఉద్దేశ్యంతో అన్నారో అనే అనుమానం కలుగక మానదు.