అక్కడ షేక్ హ్యాండ్స్...ఇక్కడ కాల్పులు!

ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ చాలా రోజుల తరువాత పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసి మాట్లాడారు. వారిరువురూ కజకస్తాన్ లోని ఆస్థానా నగరంలో జరుగుతున్న ఒక సదస్సులో శుక్రవారం కలుసుకొన్నారు. వారిరువురూ కాసేపు మాట్లాడుకొన్నారు. భారత్-పాక్ మద్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి వారి మద్య ఎటువంటి చర్చ జరుగలేదని తెలుస్తోంది. 

అయితే అక్కడ వారివురూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని మాట్లాడుకొంటున్న సమయంలోనే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉరి సెక్టార్ దగ్గర పాక్ లోనుంచి భారత్ లోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు తీవ్రవాదులతో భద్రతాదళాలు హోరాహోరీ పోరాడి చివరకి హతమార్చాయి. అంతకు ముందు గురువారం కూడా పాక్ నుంచి ఏడుగురు ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ వారిని కూడా భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిలో ఒక భారత జవాను మృతి చెందాడు. 

భారత్-పాక్ సంబంధాలు ఎంత ప్రయత్నించిణా ఎందుకు మెరుగుపడటం లేదంటే అందుకు ఇదే చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పాక్ ప్రభుత్వం ఒకవైపు భారత్ తో చర్చలు సాగిస్తూనే మరోవైపు ఈవిధంగా భారత్ పై దాడులు చేస్తుంటుంది. పాక్ తీరు ఎన్నటికీ మారదని పదేపదే ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి.