ఆయన ముఖ్యమంత్రి కావాలనుకొంటే నాకు ఓకె!

దేశంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో ముఠాలు..వాటి మద్య కీచులాటలు కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. నేటికీ లోలోన వారి మధ్య ఎన్ని లుకలుకలున్నప్పటికీ పైకి అందరూ సమైక్యంగా కనబడుతుండటం విశేషం. అందుకు తాజా ఉదాహరణగా జానారెడ్డి మాటలను చెప్పుకోవచ్చు. ఆయన సూర్యాపేటలో హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “ నేను కూడా సిఎం రేసులో ఉన్నప్పటికీ ఒకవేళ ఉత్తం కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నట్లయితే అందుకు నేను కూడా ఆయనకు పూర్తిగా సహకరిస్తాను. అయినా ఎన్నికలు సమీపించినప్పుడు మా అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తుంది. అది ఎవరి పేరు ప్రకటించినా అందరం వారికి సహకరిస్తాము. ఈ విషయంలో మా పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా దానిని మేమందరం శిరసావహిస్తాము. ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించింది కనుక మేమందరం ఆయనకు పూర్తి సహకారం అందిస్తాము. ఎలాగైనా వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే మా ప్రధానలక్ష్యం. దాని కోసం అందరం కలిసి పనిచేస్తాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సోనియా గాంధీ రుణం తీర్చుకొంటాము,” అని అన్నారు.