హైదరాబాద్ కు ఉగ్రవాదుల ముప్పు

హైదరాబాద్ నగరంలో రద్దీగా ఉండే మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఐటి కంపెనీలుండే ప్రాంతాలలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హైదరాబాద్ పోలీసులను హెచ్చరించాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నగరంలో ప్రధాన ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్స్, బాంబు స్క్వాడ్స్ తో విస్తృతంగా తనికీలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్ లోని ఇనార్బిట్ షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలలో శుక్రవారం ఉదయం విస్తృతంగా తనికీలు నిర్వహించారు. తనికీలు నిర్వహించడమే కాకుండా అక్కడి సంస్థల యజమానులను, ప్రజలను అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు. ఎవరైనా అనుమానించదగ్గ వ్యక్తులు కనిపించినా, అనుమానస్పద వస్తువులు కనిపించినా తక్షణం తమకు తెలియజేయమని మైకుల్లో  ప్రచారం చేస్తున్నారు. 

గత మూడేళ్ళ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి జొరబడి విద్వంసం సృష్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారిని భద్రతాదళాలు సరిహద్దుల వద్దే సమర్ధంగా నియంత్రించగలుగుతున్నాయి. వారి కళ్ళుగప్పి లోపలకు ప్రవేశించగలిగిన ఉగ్రవాదులు ఒకసారి పఠాన్ కోట్ పై దాడి చేయగలిగారు. ఆ తరువాత కాశ్మీర్ లోని యూరి ఆర్మీ క్యాంప్ పై దాడి చేయగలిగారు. అప్పటి నుంచి దేశంలో నిఘా పెరిగినందున ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికే ఎక్కువగా పరిమితం అవుతున్నారు తప్ప ఇతర రాష్ట్రాలలోకి ప్రవేశించడానికి సాహసించలేకపోతున్నారు. 

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత పోలీస్ వ్యవస్థను మరింత ఆధునీకరించడంతో మళ్ళీ ఉగ్రవాదులు నగరంలోకి కాలు మోపలేకపోతున్నారు. మళ్ళీ చాలా రోజుల తరువాత హైదరాబాద్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే వార్తలు వినిపించాయి. కనుక పోలీసులే కాకుండా నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమే.