ఏపి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటి దురద గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అది తెలియనివారు ఆయన తాజాగా అన్న ఈ మాటలు వింటే అర్ధం చేసుకోవచ్చు. చెవిరెడ్డి మళ్ళీ నిన్న మరోసారి తన నోటికి పని చెప్పారు. చిత్తూరు జిల్లా ఐరాలలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు తెదేపా అండ చూసుకొని తెగ రెచ్చిపోతున్నారు. మరో ఏడాదిన్నరలో మేము అధికారంలోకి రాగానే వారందరి భరతం పడతాము. వైకాపా నేతలతో, కార్యకర్తలతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను అందరూ పశ్చాతాపపడే విధంగా వారిని..వారి కుటుంబాలను కూడా మేము వెంటాడి వేధించి ప్రతీకారం తీర్చుకొంటాము. ఇప్పుడు మాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులందరినీ ఏ అండమాన్ కో బదిలీ చేసేస్తాము. అతను ఎస్సై కావచ్చు లేదా ఎం.ఆర్.ఒ. కావచ్చు లేదా వాడబ్బ తాత అయినా కావచ్చు..ఎవరినీ మేము వదిలిపెట్టె ప్రసక్తే లేదు. అందరిపై చర్యలు తీసుకోవడం ఖాయం,” అని అన్నారు.
యధారాజా తధాప్రజా అన్నట్లు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పోలీసులను, జిల్లా కలెక్టర్లను ఇదేవిధంగా బెదిరిస్తున్నప్పుడు, ఆ పార్టీ నేతలు మరొకరకంగా వ్యవహరిస్తారని ఆశించలేము. అధికారంలో ఉన్న పార్టీల నేతల నుంచి ప్రభుత్వాధికారులకు ఇటువంటి ఒత్తిళ్ళు ఎదురవుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నుంచి కూడా ఈవిధంగా ఒత్తిళ్ళు ఎదుర్కోవలసిరావడం చాలా అవాంచనీయం. రాజకీయ పార్టీలు తమ స్థాయిని దిగజార్చుకోవడమే కాకుండా ఈవిధంగా బెదిరించి ప్రభుత్వ వ్యవస్థలను కూడా దిగజార్చే ప్రయత్నం చేస్తుండటం వలన చేజేతులా ఒక అరాచక వ్యవస్థను తయారు చేసుకొంటున్నట్లు అవుతుంది.