కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంద్ సౌర్ ప్రాంతంలో నిన్న పోలీసుల కాల్పులలో చనిపోయిన ఐదుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈరోజు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, గిరిజా వ్యాస్, సచిన్ పైలెట్ తదితరులతో కలిసి అక్కడికి చేరుకొనే ప్రయత్నం చేయగా మధ్యలో పోలీసులు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పోలీస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వారిని తోసుకొని ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ కార్యకర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ముందుకు సాగారు. కానీ పోలీసులు ఆయనను వెంబడించి పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సంగతి తెలుసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి చేరుకొని నినాదాలు చేశారు. కానీ ఆయన వెనక్కు తిరిగి డిల్లీ వెళ్ళిపోయేమాటయితేనే విడిచి పెడతామని చెప్పడం ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మధ్యప్రదేశ్ లో భాజపా ప్రభుత్వం రైతులపై కాల్పులు జరుపడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చిన తన వంటి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి నిరంకుశత్వం ప్రదర్శిస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.