నీట మునిగిన విశ్వనగరం

 చినుకు పడనంతవరకు హైదరాబాద్ లో నీటికి కటకట..చినుకు పడితే నగరంలో ఎక్కడ చూసినా నీళ్ళే కనబడతాయి. నగరంలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు అన్నీ కూడా పెద్ద పెద్ద చెరువులను తలపిస్తుంటాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఉదయం 6-7 గంటల వరకు ఆగకుండా కురిసిన బారీవానతో పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కోఠి, అబీడ్స్, ఆర్టీసి క్రాస్ రోడ్స్, తార్నాక, ఉప్పల్, రామాంతపూర్, మాదాపూర్, ఎల్.బి.నగర్, దిల్ షుక్ నగర్, చైతన్యపురి, మలక్ పేట, చార్మినార్, ఓల్డ్ సిటీ, సైదాబాద్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, సంతోష్ నగర్, జూబ్లీ హిల్స్ మొదలైన అన్ని ప్రధానప్రాంతాలలో రోడ్లు నీట మునగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు పూర్తిగా నీట మునిగాయి.

నగరం నడిబొడ్డున పంజాగుట్టలో మ్యాన్ హోల్స్ జామ్ అవడంతో వర్షపునీరు రోడ్లను ముంచెత్తింది. నగరంలో అనేక లోతట్టు ప్రాంతాలలో అనేక దుఖాణాలు, ఇళ్ళలోకి నీళ్ళు చేరాయి. తెల్లవారు జాము నుంచి చాలా బారీగా వర్షం కురుస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. గత ఏడాది వర్షాకాలంలో ఎదురైనా చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనబడలేదు. కనుక ఈసారి ప్రభుత్వం ఇంకా బారీ స్థాయిలో ముంపు నివారణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది.