ఏపిలో తెదేపా, వైకాపాల మద్య రాజకీయాలు ప్రజలు సైతం అసహ్యించుకొనే స్థాయికి దిగజారిపోయాయి. నిన్న కురిసిన కొద్దిపాటి వానకే వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక శాసనసభ భవనంలోని ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చాంబర్ లోకి నీళ్ళు వచ్చేసినట్లు తెలియడంతో వైకాపా ఎమ్మెల్యేలు, మీడియాను వెంటబెట్టుకొని మరీ లోపలకు ప్రవేశించాలని ప్రయత్నించారు. కానీ వారిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో శాసనసభ బయటే ధర్నా చేశారు. కోట్లు పోసి ప్రపంచస్థాయిలో చాలా గొప్పగా నిర్మించామని తెదేపా సర్కార్ చెప్పుకొంటున్న భవనంలోకి కొద్ది పాటి వర్షానికే నీళ్ళు ఎలా లీక్ అయ్యాయని వారు ప్రశ్నించారు. దానిని బట్టి భవనం ఎంత నాసిరకంగా నిర్మించారో అర్ధం అవుతోందని వాదించారు. ఈరోజు తెలుగు, ఇంగ్లీష్ మీడియాలో ఇదే ప్రధానవార్తగా వచ్చింది. ఒక ఆంగ్ల దినపత్రికలో జగన్ ఛాంబర్ లోపల పెచ్చులు ఊడి క్రిందపడిన సీలింగ్ ముక్కలను, నీళ్ళను పనివాళ్ళు శుభ్రం చేస్తున్న ఫోటోలను కూడా ప్రచురించింది. భవనం లోపలే కాకుండా వెలుపల కూడా ఒక గోడ పడిపోవడం ఆ ఫోటోలలో స్పష్టంగా కనబడింది.
దీనిపై తెదేపా తనదైన శైలిలో ఊహించని విధంగా చాలా ధీటుగా స్పందించింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా ఎక్కడి నుంచి నీళ్ళు లీక్ అవుతున్నాయో పరిశీలించి చూడగా ఒక చోట ఏసీ నుంచి నీళ్ళు బయటకు వెళ్ళే ఒక గొట్టాన్ని ఎవరో కత్తిరించినట్లు గుర్తించారు. అంటే ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా ఈ కుట్ర చేసి ఉంటారని అనుమానించారు. జగన్ ఛాంబర్ లోకి నీళ్ళు లీక్ అవుతున్న సంగతి మొట్టమొదట వైకాపాయే బయటపెట్టింది కనుక ఆ పార్టీకి సంబంధించినవారే ఎవరో ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ఈ కుట్రకు పాల్పడి ఉండవచ్చని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. కనుక దీనిపై సి.ఐ.డి.దర్యాప్తుకు తెదేపా ప్రభుత్వం ఆదేశించింది. తెదేపా నేతలే ఆ గొట్టాన్ని కోసి తమపై నింద వేస్తున్నారని వైకాపా నేతలు వాదిస్తున్నారు.