కాంగ్రెస్ శాసనసభ్యురాలు డికె అరుణ భర్త భరత్ సింహారెడ్డి ఈరోజు కారు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పయనిస్తున్న కారును మహబూబ్ నగర్ జిల్లాలో మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద ఎదురుగా వస్తున్న మరొక కారు బలంగా డ్డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు బాగా దెబ్బతింది. అయితే ఆయన సీటు బెల్టు పెట్టుకొని ఉండటం, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో ఆయన సురక్షితంగా ప్రాణాలతో బయటపడగలిగారు. ఆయనతో పాటు కారులో ఉన్న మరొక మహిళకు కొద్దిగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయనకేమీ ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. డికె అరుణ కూడా అపోలో ఆసుపత్రి చేరుకొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇది యాదృచ్చికంగా జరిగిన ప్రమాదమా లేక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.